Saturday, May 28, 2011

నిద్ర లేని రాత్రి

చదువుకునేటప్పుడు చదవాలనే తహతహతో,
చదివినతరువాత ఉద్యోగం కోసం తపనతో,
పెళ్ళికాకముందు తన తలపులతో,
పెళ్ళయ్యాక తన తనువుతో,

-----అన్నీ నిద్ర లేని రాత్రులే

Thursday, May 20, 2010

గంగమ్మ జాతర

నేను ఈ మద్య ఉద్యోగ రీత్యా తిరుపతి లో ఉంటున్నాను. ఇక్కడ మే నెలలో గంగమ్మ జాతర జరుగుతుంది.
సాధారణంగా శక్తి ఆరాధనలో జంతు బలులు ఇవ్వడం జరుగుతుంది. శాకాహారులమైన మేము సాత్వికమైన దేవతలైన లక్ష్మి, సరస్వతి, గాయత్రి వంటి దేవతలనే పూజిస్తాము. ఒకవేళ ఆరాదించాల్సి వచినపుదు ఇంటిలోనే పూజించుకుంటాము. పోలాల అమావాస్య కి, కనుమ నాడు, ఇంకా కొత్త అమావాస్య అనగా ఉగాది ముందు రోజు మా అమ్మ గారు అమ్మ వారికి అనగా శక్తి కి నైవేద్యాలు ఇంటిలోనే పెడతారు. అలా పెరిగిన నేను ఈ గంగమ్మ జాతరకి వెల్లడం జరిగింది. గుడి నిండా జంతు బలులే. ఎక్కడ చూసినా కోడి తలకాయలే. గుడి ముందు బాగంలో మేకలు, గొర్రెల వంటివి బలి ఇస్తుండగా గుడిలో ఎక్కడ పడితే అక్కడ కోళ్ళను బలి ఇస్తున్నారు. ప్రదక్షనలు చేసుకుందామని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ఆ కోడి తలకాయల మీద నడవాల్సి వచ్చింది. నాకైతె ఏదోలా అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది. ఇంకా చాలా విశేషాలు ఉన్నయి. జాతర నాడు ఇక్కడ మగ వాళ్ళందరూ ఆడ వెషం వెసుకుని గుడి కి వస్తారు.

Tuesday, December 30, 2008

పిచ్చుక

నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక వ్యక్థి పిచ్చుకకి తాడు కట్టి ఆడించేవాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే స్వేచ్చగా ఎగిరే పక్షిని అలా బందించేసాడని. కాని ఇప్పుడు ఆ విధంగానైనా పిచ్చుకని చూడగలిగేవాళ్ళమేమోనని అనిపిస్తూ ఉంటుంది. పిచ్చుకలు ఎక్కదో తప్ప కనిపించడం మానేసాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో గుత్తగా కట్టిన వరికంకులను గుళ్ళల్లోను, ఇళ్ళల్లోను వ్రేలాడదీస్తూ ఉంటారు. పిచ్చుకలు వచ్చి పంటను నాశనం చేయకుండా అలా చేస్తూ ఉంటారు. పిచ్చుకలు కనుమరుగు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. . అందులో ముఖ్యమైనవి...
1. పంటల మీద క్రిమిసం హారక మందులను ఉపయోగించడం,
2. సెల్ ఫొన్ ల యొక్క తరంగాలకి తట్టుకోలేకపోవడం.
అందుకే హైకూ బాషలో ఇలా రాస్తున్నాను.

పిచ్చుకపై ఆధునిక బ్రహ్మాస్త్రం సెల్ ఫొన్

Friday, December 19, 2008

మరణ లేఖలు

ఈ మద్య చదివిన కధలలో సాక్షి వార పత్రికలో వచ్చిన మరణ లేఖలు చాలా నచ్చింది. ఈ కధ నవంబరు 2 వ తారీఖున ఫండే లో వచ్చింది.ఈ కథలో చివరన ఈ కవిత చాలా బాగుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాను.
వాంఛ - పవిత్రత,
స్వేఛ్ఛ - అణచివేత,
శాంతి - హింస,
వ్యక్తివాదం - సమిస్టితత్వం
పరస్పర విరుద్దమైన భావాలన్నీ
మనలోనే వున్నప్పుడు
ఆదర్శాలు - వాస్తవాల మద్య అగాధం పెరిగినప్పుడు
మనతో మనమే విభేదించినప్పుడు
స్థిమితంగా ఉన్నవాడు మనిషిలా బతుకుతాడు!
లేనివాడు దేవుడైపోతాడు!!
--పూడూరి రాజిరెడ్డి

Tuesday, September 18, 2007

శిశువు

శిశువు బొటనవేలు నొట్లో వేసుకుని …. గుర్రం జాషువా గారి ‘గోరుముద్దలు ‘సంకలనం.
చిన్ని శిశువు, చిన్ని శిశువు …….అన్నమయ్య సంకీర్తన.
అన్నీంటికీ మూలం శిశువు జీవితం.
ఫుట్టినప్పటి నుంచీ పరుగు పెట్టే వరకూ ఉన్న ఆ సమయం ఎంతో అందమైనది.
శిశువు ఆ ఇంటికి మహారాజు.
ఆ సమయంలో జరిగే ప్రతీ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు.ఆప్పుడు జరిగే కొన్ని వేడుకలు.
ఫుట్టగానే తీపిని పంచుతారు.

బోర్లాపడ్డప్పుడు -------- బొబ్బట్లు,
ఆల్లరి చేస్తే -------- చిల్లర,
పాకినప్పుడు -------- పాకం ఉండలు,
కూర్చున్నప్పుడు -------- కుడుములు,
అడుగులేసినప్పుడు -------- అరిసెలు,
చిన్న చిన్న మాటలకు-------- పంచదార చిలకలు,

పంచిపెడతారు.

ఇవి కాక నెల పుట్టినరోజులు, భోగి పళ్ళు ఇలా చాలానే ఉంటాయి.

Sunday, September 16, 2007

శివుడి రంగు

మనం చాలా చిత్రాలలో శివుడిని నీలం రంగులో గమనిస్తాము. మనం శివుడిని నీలకంఠుడు అని పిలుస్తాము. ఆటువంటప్పుడు శివుడి కంఠం మాత్రమే నీలం రంగులో ఉండాలి. కాబట్టి శివుడి రంగు నీలం కాదు.
దీనికి సంబంధించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్వాతి సపరివార పత్రిక లో నన్ను అడగండి శీర్షికలో మాలతి చందూర్ గారు ఇచ్చిన సమాధానం !

ప్రశ్న: శ్రీ క్రిష్ణుడిని నీల మేఘ శ్యాముడన్నారు. శివుడు తెలుపా? నలుపా?
సమాధానం:

'పార్వతీ పతి తెల్పు, పాల సంద్రము తెల్పు,
కామధేనువు తెల్పు, కంచు తెల్పు,
కల్పవ్రుక్షము తెల్పు, కైలాసగిరి తెల్పు,
మల్లెపూవులు తెల్పు, మంచు తెల్పు,'

అని కదా చాటువు చెపుతున్నది.

Thursday, September 13, 2007

మక్కి కి మక్కి

ఒక పనిని ఉన్నది ఉన్నట్లుగా ఏ మాత్రం అలోచించకుండా అలాగే చేయడాన్ని మక్కి కి మక్కి చేయడం అంటారు.ఇలా అనడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని 1996-97 లో నేను 9 వ తరగతి చదువుతూ ఉండగా మా తెలుగు గురువు గారు శ్రీ ఓంకారశర్మ గారు చెప్పారు.
పూర్వ కాలం లో కథలు, కావ్యాలు అన్ని కూడా తాటి ఆకుల మీద రాసేవారు. తాటి ఆకుల జీవిత కాలం చాలా తక్కువ. అందుకని పాత కావ్యాలు, కధలు పాడైపోయినప్పుడల్లా కొత్త తాటి ఆకుల పై రాసి జాగ్రత్త చేసేవారట. సాధారణంగా ఆ పనిని అప్పటి రాజులు కవుల చేత వారి ఆస్థానం లో చేయించేవారట.
అలా ఒకసారి ఒక కావ్యం రాస్తునప్పుడు ఒక పాత కావ్యంలో ఒకచోట ఒక చచ్చిపోయిన ఈగ కనిపించిందట ఒక కవి గారికి. వెంటనే అతను తన కొత్త కావ్యంలో అదే చొట మరో ఈగను చంపి అతికించి తన కావ్యాన్ని పూర్తి చేసాడట.
సంస్క్రుతం లో మక్కి అంటే ఈగ అని అర్థం. ఒక ఈగ ఉన్న స్థానాన్ని మరో ఈగతో నిలిపి ఉంచాడు కనుక అది మక్కి కి మక్కి అయ్యింది అని, అలా ఆ జాతీయం వాడుక లో కి వచ్చిందని మా గురువు గారు చెప్పారు.